కీ లాగ‌ర్స్ గురించి తెలుసుకుందామా…!

కీ లాగ‌ర్స్ గురించి తెలుసుకుందామా…!

మనం తెలివైన వారిమనుకుంటే హ్యాకర్స్‌ మనకంటే తెలివిమీరిపోతున్నారు. ఇంటర్‌నెట్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. నెటిజన్స్‌ అనేక రూపాల్లో ఇంట‌ర్‌నెట్‌ను ఉపయోగిస్తున్నారు. ఇంటర్నెట్ ప్రపంచంలో మన అవసరాన్ని బ‌ట్టి నిత్యం కీబోర్డ్‌ ద్వారా ముఖ్యమైన సమాచారాన్ని ఫీడ్ చేస్తుంటాం. వీటిలో మన పాస్‌వర్డ్స్‌, క్రెడిట్ కార్డ్‌ సమాచారం, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సమాచారం…ఇలా ఒకటేమిటి ఎంతో కీలకమైన సమాచారాన్ని మొత్తం కంప్యూటర్‌ ద్వారానే నిర్వహిస్తున్నాం. ఈ క్రమంలో మనం ఇచ్చే ఈ కీలక సమాచారాన్ని తస్కరించే చిన్నపాటి ప్రొగ్రామ్స్‌నే కీ లాగర్స్‌ అని పిలుస్తారు. ఇటీవల కాలంలో వీటి హావా బాగానే నడుస్తుంది. అంతే కదా మంచి వున్న చోటే చెడు కూడా వుంటుంది. కావున మనమే జర జాగ్రత్తగా వుండాలి మరి..!

హ్యాకర్స్‌ బాగా తెలివైన వారు తమ తెలివితేటలను పది మందికి ఉపయోగపడేలా ఒక మంచి ప్రొగ్రామ్‌ను కనిపెట్టి అందించాలి. కానీ అలా కాకుండా పదిమంది డేటాను, నెట్‌వ‌ర్క్‌ల‌నులను పాడు చేయడానికి ప్రొగ్రామ్స్‌ను కనిపెడుతుంటారు. ఆన్‌లైన్‌లో అనేక మంది ప్రొగ్రామర్స్‌ కమ్యూనిటీలుగా ఏర్పడి మంచి, మంచి ప్రొగ్రామ్‌లు తయారుచేసి అందిస్తున్నారు. అదే సమయంలో హ్యాకర్స్‌ కూడా ఎప్ప‌టికప్పుడు శక్తివంతమైన విద్వంసకర ప్రొగ్రామ్‌లను కూడా కనిపెడతారు. సైబర్‌ ప్రపంచంలో మంచికి, చెడుకు మధ్య ఈ పోటీ ఎప్ప‌టికీ ఉంటూనే వుంటుంది. ఈ నేపథ్యంలో మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ వుండాలి.

కీ లాగర్స్‌ అంటే …?
ఒక‌సారి ఇంట‌ర్నెట్ ద్వారా ప్ర‌పంచానికి క‌నెక్ట్ అయ్యామంటే ప్రైవ‌సీ అనేది క‌ష్ట‌మే. ప్రపంచంలో ప్రతిదీ కనెక్ట్‌ అయి వుంటుంది. మనకు తెలియకుండానే మనం కీబోర్డ్‌ ద్వారా అందించే ప్రతి సమాచారాన్ని స్టోర్‌ చేసుకుని హ్యాకర్స్‌కు అందించడంలో ఈ కీ లాగర్స్‌ కీలకంగా వుంటాయి. ఇవి కంప్యూటర్‌ ప్రొగ్రామ్‌ రూపంలో కానీ (సాఫ్ట్‌వేర్‌ కీలాగర్స్‌), హార్డ్‌వేర్‌ రూపంలో కానీ (హార్డ్‌వేర్‌ కీ లాగర్స్‌) వుంటాయి. మనం ఆన్‌లైన్‌లో పనిచేసే సమయంలో పెద్ద మొత్తంలో సమాచారం ఇస్తూ వుంటాం. ఉదాహరణకు మీరు నెట్ బ్యాంకింగ్ అక్కౌంట్‌ను కలిగి వుంటారు. ఆన్‌లైన్‌ ద్వారా మీ బ్యాంకింగ్‌ కార్యకలాపాలు నిర్వహించాలంటే ముందుగా లాగిన్‌ కావాలి. దీని కోసం కీలకమైన నెట్ బ్యాంకింగ్‌ సంబందించిన యూసర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌ అందిస్తారు. ఆన్‌లైన్‌ షాపింగ్‌లో క్రెడిట్ కార్డ్‌ సమాచారాన్ని ఇస్తుంటారు.

ఫేస్‌బుక్ అక్కౌంట్‌లోకి లాగిన్‌ కావాలంటే పాస్‌వర్డ్‌ను టైప్‌ చేయాలి, అలాగే మెయిల్‌ చెక్కింగ్‌… ఇలా పలు సందర్భాల్లో ముఖ్యమైన సమాచారాన్ని ఇస్తుంటాం.
ఈ సమాచారాన్ని కీ లాగర్స్‌ కీబోర్డ్‌లో ఎంటర్‌ చేసే సమయంలోనే క్యాప్చర్‌ చేసి స్టోర్‌ చేసుకుంటాయి. సాఫ్ట్‌వేర్‌ కీ లాగర్స్‌ గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఎందుకుంటే మన సిస్టమ్‌ నుంచే ఆన్‌లైన్‌ బ్రౌజింగ్‌ చేస్తున్నప్పుడు సాఫ్ట్‌వేర్‌ కీ లాగర్స్‌ ద్వారానే సమాచారాన్ని హ్యాకర్స్‌ పొందడం జరుగుతుంది. కీ స్ట్రోక్‌ లాగింగ్‌ ద్వారా వచ్చే సమాచారాన్ని తస్కరించే వాటినే కీ లాగర్స్‌ అని పిలుస్తారు.

కీ లాగర్స్‌ ఎలా పనిచేస్తాయి…?
కీ లాగర్స్‌ ఆఫ్‌లైన్‌లోనైనా పనిచేస్తాయి లేదా ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు కూడా పనిచేస్తాయి.మనకు తెలియకుండానే మన సిస్టమ్‌లో నిల్వ అయిన కీ లాగర్‌ ప్రొగ్రామ్స్‌ మనం ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు కూడా మనం ఎంట‌ర్ చేసే సమాచారాన్ని టెంపరరీ ఫైల్‌లో నిల్వ చేస్తాయి. లేదా ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు కూడా ఈ కీ లాగర్స్‌ మనం ఇచ్చే సమాచారాన్ని నిల్వ చేసుకుంటూ, అ సమాచారాన్ని ముందుగానే నిర్దేశించిన హ్యాకర్స్‌ అడ్రస్‌కు పంపుతాయి.సాదారణంగా మనం సర్ఫింగ్‌ చేస్తున్నప్పుడు లేదా డౌన్‌లోడింగ్‌ చేస్తున్నప్పుడు (ఈ డేటా అంత ముఖ్యమైని కాదు కదా..!) ఇవి యాక్టివ్‌గా వుండవు. ఎప్పుడైతే మనం ఇమెయిల్‌లోకి కానీ ఫేస్‌బుక్‌లోకి కానీ లేదా నెట్ బ్యాంకింగ్‌లోకి కానీ లాగిన్‌ అవుతామో అప్పుడు వెంటనే అవి యాక్టివ్‌ అవుతాయి. కీలకమైన సమాచారాన్ని స్టోర్‌ చేసుకుంటాయి. మొద్లో ఇటువంటి ప్రొగ్రామ్స్‌ను తయారు చేయాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. పెద్ద మొత్తంలో కోడింగ్‌ రాయాల్సి వుండేది. కానీ ప్రస్తుతం టెక్నాలజీ అప్‌గ్రేడ్‌ కావడంతో, అనేక బిల్ట్‌ఇన్‌ ఫంక్షన్స్‌ను ప్రొగ్రామింగ్‌ లాంగ్వేజీలు కలిగి వుంటున్నాయి.

కీ లాగర్స్‌ ఇలా తయారుచేస్తుంటారు…
కీలాగర్స్‌ అనే ప్రొగ్రామ్స్‌ను లోడ్‌ కావడానికి మొదట కోడ్‌ రాయాలి. తర్వాత ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ ట్రేసింగ్‌ చేయడం కోసం కోడ్‌ రాయాల్సి వుంటుంది.విండో ట్రేసింగ్‌, కీబోర్డ్‌ క్యారెక్టర్స్‌ క్యాప్చరింగ్‌…తదితర వాటి కోసం కోడ్‌ రాసి కీ లాగర్స్‌ను తయారు చేస్తారు. ఉదాహరణకు కీబోర్డ్‌ క్యాప్చరింగ్‌ కోసం చాలా సులువుగా సి లైబ్రరీ ఫంక్షన్‌ సులువైన ఒక ఫంక్షన్‌ను అందిస్తుంది.

నోట్ : రీడర్స్‌ అవగాహన కోసం ఈ కోడ్‌ను అందిస్తున్నాం. కీ లాగర్స్‌ను తయారు చేయడం కోసం మాత్రం కాదు.

#include<windows.h>
#include<stdio.h>

int main(void)
{
int a;
while(1)
{
if(GetAsyncKeyState(‘A’))
MessageBox(0,”A has been pressed”,”Keylogger”,0);
}
return 0;
}

పైన చెప్పుకున్న ప్రొగ్రామ్‌లో  “GetAsyncKeyState()”  అనే ఫంక్షన్‌ ద్వారా రియల్‌టైమ్‌లో జరిగే కీ ఎంట్రీలను ట్రేస్‌ చేయవచ్చు. ఉదాహరణకు పైన కీబోర్డ్‌ నుంచి ఏ అనే లెటర్‌ ప్రెస్‌ చేయబడిందనే మేసేజ్‌ వచ్చింది. దీని తర్వాత సమాచారాన్ని నిల్వ చేసుకోవడం కోసం కోడ్‌ రాస్తారు. నిల్వ చేసిన సమాచారం వెబ్‌లోకి అప్‌లోడ్‌ చేయడం కోసం రొటీన్‌ రాస్తారు. దీని కోసం సాకెట్ ప్రొగ్రామింగ్‌ కోడ్‌ను వుపయోగించడం జరుగుతుంది. ఈ విధంగా హ్యాకర్స్‌ పలు విధాలుగా కష్టపడి ప్రొగ్రామింగ్‌ కోడ్‌ రాసి కీ లాగర్స్‌ను తయారుచేస్తారు. వీటిని వెబ్‌ద్వారా స్ప్రెడ్‌ చేసి పలు సిస్టమ్స్‌లోని సమాచారాన్ని తస్కరించడం జరుగుతుంది. ఇటువంటివి దేశ, విదేశాలలో ఎప్ప‌టికీ జరుగుతున్నాయో అంటే, కంప్యూటర్‌ సెక్యూరిటీ ప‌టిష్టంగా లేదని చెప్పవచ్చు.

హార్డ్‌వేర్‌ కీ లాగర్స్‌

హార్డ్‌వేర్‌ కీ లాగర్స్‌ …
హార్డ్‌వేర్‌ పరంగా కూడా కీలాగర్స్‌ను సెటప్‌ చేస్తారు. వీటిని కీబోర్డ్‌ ద్వారా లేదా సిస్టమ్ యూనిట్‌కు (పటంలో చూపినట్టు) వెనుకవైపున
హార్డ్‌వేర్‌ కీ లాగర్స్‌ను వుంచుతారు. ఇవి మనం ఎంట్రీ చేసే సమాచారాన్ని నిల్వ చేస్తాయి. ఆఫీస్‌లో పనిచేసే సమయంలో మన కంప్యూటర్‌ను, అలాగే సైబర్‌ సెంటర్స్‌లోని కంప్యూటర్‌ను కాస్త గమనించి ఉపయోగించాలి. హార్డ్‌వేర్‌ కీలాగర్స్‌ను సులువుగా మనకు తెలియకుండానే కీబోర్డ్‌ కనెక్టర్‌ ద్వారా కనెక్ట్‌ చేసి మనం ఎంట్రీ చేసే డేటాను తెలుసుకోవడం జరుగుతుంది.

కంప్యూటర్‌కు ఎలా సోకుతాయి…?
టెక్నికల్‌గా చూస్తే కీలాగర్‌ అంటే కోడ్‌ మాత్రమే. ఇది కీస్ట్రోక్స్‌ను నిల్వ చేసుకుంటుంది. ఇవి ట్రోజాన్‌ హార్స్‌ లేదా మాల్‌వేర్‌లో ఒక బాగంగా వుండి కంప్యూటర్‌లోకి చేరుతాయి. ఇవి కంప్యూటర్‌లోకి చేరడానికి అనేక మార్గాలు వున్నాయి. మీ కంప్యూటర్‌లో మీకు తెలియకుండా వేరే వారు వీటిని ఇన్‌స్టాల్‌ చేయవచ్చు. కావున రిమోట్‌ యాక్సస్‌లో వుండే సమయంలో జాగ్రత్తగా వుండాలి.

మీరు వుపయోగించే బ్రౌజర్‌ శక్తివంతంగా (సెక్యూర్‌గా) వుండదు. వెబ్‌ బేస్డ్‌ ఎాక్స్‌ జరిగినప్పుడు లేదా మాలిసియస్‌ కోడ్‌ను కల్గి వుండే వెబ్‌సైట్‌ను దర్శించినప్పుడు ఈ కోడ్‌ సిస్టమ్‌లోకి ఇన్‌స్టాల్‌ అవుతుంది.
రిమూవబుల్‌ మీడియా లేదా యుఎస్‌బి డ్రైవ్స్‌ (పెన్‌డ్రైవ్స్‌) ద్వారా కూడా ఇవి వ్యాప్తి చెందుతాయి.

పీర్‌ టు పీర్ నెట్‌వర్క్‌ల ద్వారా కూడా ఇటువంటి కోడ్స్‌ ఇన్‌స్టాల్‌ అవుతుాంయి. నెట్‌వర్కింగ్‌ను ఉపయోగించుకుని ఇటువంటివి సులువుగా వ్యాప్తి చెందుతాయి. కీ లాగర్స్ నెట్‌లోని మంచి ప్రొగ్రామ్స్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోవడం ద్వారా కూడా వ్యాప్తి చెందే అవకాశం వుంది.

ఇంట‌ర్నెట్‌లో ల‌బించే ఉచిత లేదా పెయిడ్ ప్రొగ్రామ్స్ ద్వారా హ్యాకర్స్‌ కీ లాగర్స్‌ కోడ్‌ను ప్రొగ్రామ్‌కు ఎాచ్‌ చేయడం జరుగుతుంది. ఉదాహరణకు ఒక మంచి గేమ్‌ వుంది…దీనికి బైండర్‌ ద్వారా కీలాగర్‌ను ఎాచ్‌ చేసి వెబ్‌ ద్వారా… మంచి గేమ్‌ ఉచితంగా వుంది ట్రై చేయండనే మేసేజ్‌ పంపుతారు. గేమ్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్న వెంటనే కీలాగర్‌ ఇన్‌స్టాల్‌ అవుతుంది. తర్వాత పనిచేయడం ప్రారంభించి ముఖ్యమైన సమాచారాన్ని వెబ్‌ ద్వారా హ్యాకర్స్‌కు చేరవేస్తాయి.

కీ లాగర్స్‌ నుంచి ఎలా కాపాడుకోవాలి…?
1. ప్రతి సమస్యకు పరిష్కారం వుంటుంది. అలాగే కీ లాగర్స్‌నుంచి కూడా మీ సిస్టమ్‌ను కాపాడుకోవచ్చు. సిస్టమ్‌లో ఇన్‌స్టాల్‌ అయి వున్న వాటిని మాన్యువల్‌గా తొలగించలేం. అయితే మాలిసియస్‌ కోడ్‌ స్కానింగ్‌ నిర్వహించే వెబ్‌సైట్స్ ద్వారా సిస్టమ్‌లో ఏవేని కోడ్‌ వుంటే వాటిని తొలగించగలం. దీని కోసం virustotal.com … అనే వెబ్‌సైట్‌ ద్వారా మాలిసియస్‌ స్కానింగ్‌ నిర్వహించాలి.

2. సిస్టమ్‌లో ఖచ్చితంగా యాంటీ వైరస్‌ కంటే కంప్లీట్ ఇంటర్నెట్ సెక్యూరిటీని అందించే సాఫ్ట్‌వేర్‌ను వుపయోగించాలి. ఏవేని వెబ్‌సైట్స్‌ మాలిసియస్‌ కోడ్‌ను కలిగి వుంటే వాటి నుంచే వెంటనే వచ్చేయాలి. అనవసర ప్రొగ్రామ్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవద్దు. ఉపయోగపడే మంచి ప్రొగ్రామ్స్‌నే (మంచి రివ్యూను కలిగి వున్న వాటిని మాత్రమే) డౌన్‌లోడ్‌ చేసుకుని వుపయోగించగలరు. వీటితో పాటుగా యాంటీ మాల్‌వేర్‌ సాప్ట్‌వేర్స్‌ను, ఫైర్‌వాల్స్‌ను కూడా సెటప్‌ చేసుకోవాలి. సిస్టమ్‌కు తగిన ప్రొటెక్షన్‌ లేకపోతే కీలాగర్స్‌ నుంచే కాకుండా వైరస్‌ల నుంచి కూడా ప్రమాదం వుంటుంది.

3. ఇంటర్నెట్ వలన ఒకటి కంటే ఎక్కువ అక్కౌంట్స్‌ను కలిగి వుంటున్నాం. కావున షేర్డ్‌ కంప్యూటర్స్‌ నుంచి లాగిన్‌ అయ్యే సమయంలో జాగ్రత్తగా వుండాలి. ముఖ్యంగా సైబర్‌ కేఫ్‌లనుంచి ఇంట‌ర్నెట్‌ను ఉపయోగిస్తుంటే, క్రెడిట్ కార్డ్‌, నెట్ బ్యాంకింగ్‌…వంటివి వుపయోగించకూడదు.

4. మీ కంప్యూటర్‌ బయోస్‌ పాస్‌వర్డ్‌తో పాటు ముఖ్యమైన సమాచారాన్ని ఎన్‌క్రిప్ట్‌ చేసుకోవడం మరవద్దు.
ఆన్‌స్క్రీన్‌ కీబోర్డ్‌ను ఉపయోగించడం వలన కీబోర్డ్‌ నుంచి ఎంటర్‌ చేయాల్సిన అవసరం లేదు. నేరుగా మౌస్‌ ద్వారా క్లిక్‌ చేస్తూ పాస్‌వర్డ్‌లను, ఇతర సమాచారాన్ని ఎంటర్‌ చేయవచ్చు. ముఖ్యమైన (లాగిన్‌ సమాచారం) వాటిని ఎంట్రీ చేసే సమయంలో ఈ కీబోర్డ్‌ను ఎంటర్‌ చేయండి.దీని వలన కీలాగర్స్‌కు మీ సమాచారం దొరకదు. ఈ ఫీచర్‌ను బ్యాంకింగ్‌ వెబ్‌సైట్స్ అందిస్తున్నాయి.

5. మంచి బ్రౌజర్స్‌ను వుపయోగించాలి. ఎప్ప‌టికప్పుడు బ్రౌజర్‌ను అప్‌డేట్ చేస్తూ వుండాలి. ఈ బ్రౌజర్‌ ద్వారా మనం ఎంట్రీ చేసే ప్రతి సమాచారం నిల్వ అయి వుంటుంది. కావున కుకీస్‌ను, టెంప్‌ ఫైల్స్‌ను ఇతర మొత్తం సమాచారాన్ని ఎప్ప‌టికప్పుడు బ్రౌజర్‌ ఆప్షన్స్‌ నుంచి క్లీన్‌ చేయాలి. ప్రతి బ్రౌజర్‌లోను హిస్టరీని క్లీన్‌ చేసే ఆప్షన్‌ వుంటుంది. అదే విధంగా మీ పర్సనల్‌ కంప్యూటర్‌లో తగిన సెక్యూరిటీ వుందనిపిస్తేనే మీరు ఎంట్రీ చేసే లాగిన్‌ సమాచారాన్ని కూడా నిల్వ చేసుకొండి. దీని లాగిన్‌ అయ్యే ప్రతిసారి యూసర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఎంట్రీ చేయాల్సిన అవసరం లేదు.

6. అక్కౌంట్ వివరాలను రికవరీ చేయడం కోసం అక్కౌంట్‌ను క్రియేట్ చేసే సమయంలో ఇచ్చే వివరాలను గుర్తు పెట్టుకోవాలి. ఉదాహరణకు సెక్యూరిటీ క్వశ్చన్‌, నిక్‌నేమ్‌…వంటివి అయితే ఈ వివరాలను ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడాలి.

7. లినక్స్ వంటి శక్తివంతమైన ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి. ఇటువంటి ఓఎస్‌లలో కీలాగర్స్ ఎటాక్స్‌ జరగడం చాలా కష్టంగా వుంటుంది. విండోస్‌ ఓఎస్‌ మీద ఇటువంటి ఎటాక్స్‌ జరగడం చాలా సులువు. ప్రపంచవ్యాప్తంగా విండోస్‌ యూసర్స్‌ ఎక్కువ కావున వారి దృష్టి ఆ పీసీలపైనే వుంటుంది.

నోట్ : కీ లాగర్స్‌ గురించి అవగాహన వచ్చింది కావున వీటి నుంచి ప్రొటెక్ట్‌ చేసుకోగలరు. మాలిసియస్‌ కోడ్‌ ద్వారా వచ్చే ఈ సాఫ్ట్‌వేర్‌ కీలాగర్స్‌ను గమనిస్తూ వుండాలి. యాంటీ మాలిసియస్‌ సాఫ్ట్‌వేర్స్‌, ఇంటర్నెట్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్స్‌ను తప్పనిసరిగా వుపయోగించాలి. ఇంటర్నెట్ ద్వారా వచ్చే టూల్స్‌, సాఫ్ట్‌వేర్స్‌, మేసేజ్‌లు, ఫిషింగ్ ఎటాక్స్‌, అనవసర అలర్ట్స్‌, అనవసర ఇమెయిల్స్‌…తదితర వాటి పట్ల అప్రమత్తంగా వుంటే సరిపోతుంది. కావున ముందు జాగ్రత్త చాలా ముఖ్యమని గుర్తించాలి.

About Digital For You 773 Articles
Computers For You is a Leading Technology & Career Magazine Publishing from Hyderabad since 1999. In addition to this Web version, We have been bringing out Computers For You magazine for over 19 years (Since 1999) continuously and this is the Largest Circulated magazine in both the Andhra Pradesh and Telangana States and in addition to these States, this is being circulated in other cities like Bangalore, Chennai, New Delhi, Mumbai & Pune...etc.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*