నేటి నుంచి వ‌ర‌ల్డ్‌ ఐటీ కాంగ్రెస్‌ అంత‌ర్జాతీయ సదస్సు

2000 వేల మందికి పైగా ప్ర‌తినిధులు, ఐటీ రంగ ప్ర‌ముఖులు
150 మందికి పైగా అంత‌ర్జాతీయ స్థాయి ఐటీ లీడ‌ర్స్‌
50కి పైగా టెక్నాల‌జీ సెష‌న్స్‌
ప్ర‌త్యేక అక‌ర్ష‌ణ – మొద‌టి హ్యూమనాయిడ్‌ రోబో సోఫియా
30 దేశాల నుంచి ప్ర‌తినిధులు
జాతీయ అంత‌ర్జాతీయ ఐటీ సంస్థ‌ల స్టాల్స్‌

హైదరాబాద్‌: ఐటీ పరిశ్రమ ఒలింపిక్స్‌గా ఖ్యాతిగాంచిన ప్రతిష్టాత్మక ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ మూడు రోజుల సదస్సు భాగ్యనగరం వేదికగా సోమవారం ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లోని హైటెక్స్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరగనున్న ఈ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభోపన్యాసం చేయనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతోపాటు ప్రముఖ ఐటీ కంపెనీల సీఈఓలు ప్రసంగించనున్నారు. వరల్డ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ సర్వీసెస్‌ అలయెన్స్‌ (డబ్ల్యూఐటీఎస్‌ఏ), నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీస్‌ కంపెనీస్‌ (నాస్కామ్‌), తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా సదస్సును నిర్వహించనున్నాయి. 40 ఏళ్లగల చరిత్రగల ఈ సదస్సును తొలిసారి భారత్‌లో నిర్వహిస్తుండటంతో దీనికి ప్రత్యేకత సంతరించుకుంది. 1978లో తొలిసారి ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ సదస్సు జరగ్గా 22వ సమావేశానికి హైదరాబాద్‌ వేదిక కావడం విశేషం. ఐటీ రంగ వ్యాపారానికి సంబంధించిన ఆలోచనలు, ఆవిష్కరణలు, వ్యూహాలు, వ్యాపారాలు, భవిష్యత్తు తదితర అంశాలపై మేధోమథనం కోసం ఏటా నాస్కామ్‌ నిర్వహించే ఇండియా లీడర్‌షిప్‌ ఫోరం (ఐఎల్‌ఎఫ్‌) కార్యక్రమం సైతం ఈ సదస్సుతోపాటే జరగనుంది. ఐఎల్‌ఎఫ్‌లో అంతర్భాగంగా ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ నిర్వహణలో నాస్కామ్‌ భాగస్వామ్యం వహించనుంది.

50కి పైగా టెక్నాల‌జీ సెష‌న్స్‌ – 30 దేశాల నుంచి ప్ర‌తినిధులు

ఐటీ కంపెనీల్లో ఆటోమేషన్‌ ప్రభావం ఎక్కువ కావడం, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ (ఏఐ), వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌), బ్లాక్‌చైన్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఐటీ కంపెనీల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇలాంటి పరిణామాలను తట్టుకునేందుకు కంపెనీలకు సంసిద్ధత తప్పనిసరిగా మారింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఐదు ప్రధాన అంశాలపై ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌లో దృష్టిసారించనున్నారు. సాంకేతిక పరిజ్ఞానంలో శరవేగంగా వస్తున్న మార్పులను తట్టుకొని ఐటీ పరిశ్రమలు మనుగడ సాధించేందుకు సంసిద్ధులై ఉండటం, వ్యాపారంలో కీలకాంశాలను డిజిటైజ్‌ చేయడం, భవిష్యత్తులో మనుగడగల ఓ సంస్థ, భవిష్యత్తు సవాళ్లు, సరిహద్దుల చెరిపివేతకు భాగస్వామ్యం అనే అంశాల ఎజెండాపై సదస్సులో మేధోమథనం చేయనున్నారు.

ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ సదస్సుకు 30 దేశాల నుంచి ఐటీ రంగానికి సంబంధించిన 2,000 మంది దార్శనికులు, పరిశ్రమ, ప్రభుత్వాల సారథులు, విద్యావేత్తలు హాజరుకానున్నారు. టాప్‌ 500 ఐటీ కంపెనీల నుంచి కనీసం 20 మంది సీఈఓలు, మరో 100 మంది ఎగ్జిక్యూటివ్‌లు ఈ భేటీలో పాల్గొననున్నారు. సదస్సులో 50కిపైగా చర్చాగోష్టులు, మరో 50కిపైగా ఐటీ ఉత్పత్తులపై ప్రదర్శన(షోకేస్‌)లు ఉండనున్నాయి. సదస్సు ప్రారంభోత్సవంలో డబ్ల్యూఐటీఎస్‌ఏ చైర్మన్‌ ఇవాన్‌ చియు, ప్రధాన కార్యదర్శి జిమ్‌ పైసంట్, విప్రో చీఫ్‌ స్ట్రేటజీ ఆఫీసర్‌ రిషబ్‌ ప్రేమ్‌జీ, నాస్కామ్‌ చైర్మన్‌ రమణ్‌ రాయ్, అధ్యక్షుడు ఆర్‌. చంద్రశేఖర్, టెక్‌ మహీంద్ర ఎండీ, సీఈఓ సీపీ గుర్నానీలు సైతం ప్రసంగించనున్నారు. సదస్సులో ప్రతినిధులు 1,000 నిమిషాల చర్చాగోష్టుల్లో పాలుపంచుకోవడంతోపాటు వ్యాపార ప్రదర్శనలు తిలకించనున్నారు. భారత సంతతికి చెందిన కెనడా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీశాఖ మంత్రి నవదీప్‌ బైన్స్, బీసీజీ చైర్మన్‌ హన్స్‌పౌల్‌ బుర్కనర్, అడోబ్‌ చైర్మన్‌ శంతాను నారాయణ్, బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్, బాలీవుడ్‌ నటి దీపికా పదుకుణే, ఇషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు సద్గురు తదితరులు సదస్సులో పాల్గొననున్నారు. హ్యూమనాయిడ్‌ రోబో సోఫియాతో మంగళవారం నిర్వహించే ఇంటర్వ్యూ సదస్సుకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

Event Dates : 19-21, February, 2018

For more details visit :  http://www.nasscom.in/wcit-nilf2018/

About Digital For You 773 Articles
Computers For You is a Leading Technology & Career Magazine Publishing from Hyderabad since 1999. In addition to this Web version, We have been bringing out Computers For You magazine for over 19 years (Since 1999) continuously and this is the Largest Circulated magazine in both the Andhra Pradesh and Telangana States and in addition to these States, this is being circulated in other cities like Bangalore, Chennai, New Delhi, Mumbai & Pune...etc.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*