బ్లాగ్ లేదా వెబ్‌సైట్‌ను పాపుల‌ర్ చేసుకోవ‌డం ఎలా..? – Part 2

మీరు ఎంచుకున్న బ్లాగ్ ఏదైనా స‌రే దాన్ని అంకిత బావంతో క్ర‌మం త‌ప్ప‌కుండా నిర్వ‌హించ‌డం ద్వారా నెటిజ‌న్స్ నుంచి క్లిక్స్ రావ‌డం, వెంట‌నే మీ బ్లాగుకి ట్రాఫిక్ పెర‌గ‌డం జ‌రుగుతుంది. నిత్యం పోస్ట్‌లు ఉండేలా చూసుకోవాలి. మొద‌టి బాగంలో ప‌లు అంశాల‌ను తెలుసుకున్నాం. రెండం భాగంలో కూడా బ్లాగును పాపుల‌ర్ చేయ‌డంలో ఉప‌యోగ‌ప‌డే ముఖ్య అంశాల‌ను తెలుసుకుందాం.

సులువుగా నావిగేట్‌ చేసుకునేలా ఉండాలి …
బ్లాగ్‌లో సమాచారాన్ని ఇస్తూ ఉంటాం. ఈ సమాచారాన్ని సులువుగా నావిగేట్‌ చేసుకునేలా ఉండాలి. సమాచారాన్ని అందించే విధానం కూడా ఇది వరకు చెప్పుకున్నట్టు సింపుల్‌గా ఉండాలి. అలాగే సమాచారం అందించే లింక్స్‌ కూడా ఎక్కువగా ఉండకుండా చూడండి. సమాచారం సరైన పద్దతిలో అందించాలి. ఒక సమాచారం అందించినప్పుడు దానికి సంబందించిన ఇతర లింక్స్‌ కూడా అక్కడే కన్పించేలా ఉండాలి. మొత్తం బ్లాగ్‌ని సులువుగా నావిగేట్‌ చేసుకునేలా ఉండాలి. బ్లాగ్‌ యెక్క మొత్తం సైట్‌ మ్యాప్‌ని కూడా ఉంచండి. తద్వారా సులువుగా సైట్‌లో ఏమి ఉందో తెలుస్తుంది.

రెగ్యుల‌ర్‌ పోస్టింగ్‌ …
బ్లాగర్స్‌ గమనించాల్సిన ముఖ్యమైన వాటిలో ఇది ఎంతో ప్రాముఖ్యత కలిగింది. ముఖ్యంగా బ్లాగ్‌కు గుండెకాయ వంటిది. రెగ్యుల‌ర్‌గా బ్లాగులో సమాచారాన్ని పోస్ట్‌ చేయడం. చాలా సింపుల్‌ మనం పది మందితో క్రమం తప్పకుండా కలివిడిగా ఉంటే మనకు అదే రీతిలో లాభాలు కూడా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే మనం నిరంతరం అప్‌డేట్‌ అవుతూ ఉంటేనే మన మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది. దేనితో సంబందం లేకుండా ఉన్నట్టు ఉంటే ఏమి అవుతుంది … మనం కూడా అప్‌డేట్‌ అవ్వకుండా ఉంటాం. మనం బ్లాగ్‌ కూడా మన మాదిరిగానే అవుతుంది. అందుకే అందులో నిరంతరం కంటెంట్‌ ఉంచడం ద్వారానే బ్లాగ్‌ గురించి పది మంది పట్టించుకుంటారు. బెల్లం చుట్టూ ఈగ అనే సామెత మనందరికి తెలిసిందే కదా. కావున రెగ్యుల‌ర్‌గా కంటెంట్‌ను మీ బ్లాగ్‌లో పోస్ట్‌ చేయాలి.

ప్ర‌క‌టనల‌ గురించి …
బ్లాగ్‌ మొదలు పెట్టిన తర్వాత తెలుసుకోవాల్సిన మరో ముఖ్య అంశం. ప్రకటనల‌ గురించి… మన బ్లాగు గురించి ఆన్‌లైన్‌లో పబ్లిసిటీ చేస్తూ ఉండాలి. అలాగే మన బ్లాగ్‌లోకి కూడా పలు మార్గాల్లో వచ్చే ప్రకటనల‌ను కూడా తీసుకోవాలి. ముఖ్యంగా గూగుల్‌ అందించే యాడ్‌సెన్స్‌, తెలిసిన వారి దగ్గరనుంచి ప్రకటనల సేకరణ, మైక్రోసాఫ్ట్‌ యాడ్స్‌ , అఫ్లియేట్స్‌ ద్వారా వచ్చే ప్రకటనల‌ను .. ఇలా పలు విధాలుగా యాడ్స్‌ సేకరించడం ద్వారా మీకు ఆదాయం వస్తుంది. అలాగే యాడ్స్‌ను వెబ్‌సైట్స్‌లో ఉంచడం కూడా ఒక కళే అని చెప్పాలి. ప్రతిచోట యాడ్స్‌ను ఉంచి నెటిజన్స్‌కు ఇబ్బంది కలిగించకూడదు. అలాగే మీ బ్లాగ్‌ని కూడా గూగుల్‌ యాడ్‌వర్డ్స్‌ ద్వారా, సోషల్‌ మీడియాలోను పబ్లిసిటీ చేసేలా ప్లాన్‌ చేసుకోవాలి.

ఇతర బ్లాగ్స్‌ , సైట్స్‌లో కామెంట్స్‌ చేయడం …
ఇతర బ్లాగ్స్‌ గురించి కానీ వారు చేసే వర్క్‌ గురించి అనవసరంగా కామెంట్‌ చేయడం వల‌న ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇతర బ్లాగ్స్‌లో అరోగ్యకరమైన వాతవరణం ఉండేలా కామెంట్‌ చేయాలి. చ‌క్క‌టి అక్క‌డి వ్యాసాల‌కు త‌గ్గ కామెంట్‌తో పాటు అక్క‌డ మ‌న బ్లాగు వివ‌రాల‌ను అంటే కేవ‌లం పేరు మాత్ర‌మే ఉండేలా చూసుకోవాలి. మన కామెంట్స్‌ హుందాగా ఉండాలి. అలాగే ఇతర బ్లాగర్స్‌తో స్నేహంగా ఉండటం వల‌న పబ్లిసిటీ పరంగా ఒకరికొకరు సహకరించుకునే వీలు ఉంటుంది. ఇతర బ్లాగు, సైట్స్‌లో కామెంట్స్‌ రూపంలో ఉపయోగపడే విషయాల‌ను ఉంచడం ద్వారా మంచి పేరు వస్తుంది. అలాగే సోషల్‌ మీడియాలో కూడా కామెంట్స్‌ చేస్తూనే అక్కడ మీ బ్లాగ్‌ లింక్‌ను కూడా ఇవ్వండి.

రిప్లై ఇవ్వాలి …
మనం ఒక బ్లాగ్‌ నిర్వహిస్తుంటే అన్నింటికీ సిద్దంగా ఉండాలి. మాకు సమయం లేదని చెప్పడం కానీ లేదా మేం చెప్పిందే వినాలి .. సందేహాల‌ను అడగవద్దు .. అనవసరంగా నన్ను డిస్ట్రబ్‌ చేయవద్దు, నేను చాలా బిజీగా ఉంటాను .. వంటి మాటలు చెప్పడం ద్వారా మన బ్లాగ్‌కు వచ్చే నెటిజన్స్‌ మన పట్ల పూర్తిగా నమ్మకాన్ని కొల్పోవడం జరుగుతుంది. ఒక బ్లాగ్‌ని నిర్వహిస్తుంటే తప్పకుండా బ్లాగ్‌ ద్వారా కమ్యూనికేషన్‌ చేస్తుంటాం. కావున మనం అందించే సమాచారానికి వచ్చే రెస్పాన్స్‌కు మనం తప్పకుండా ప్రతిస్పందించాలి లేదంటే మనం బ్లాగ్‌ నిర్వహిస్తూనే ఉంటాం .. కానీ కొంత కాలానికి మన వ్యాసాల‌కు స్పందించే వారు ఉండరు. బ్లాగర్స్‌ తప్పకుండా తమ బ్లాగులో మీ పాఠకుల‌ నుంచి వచ్చే సమాచారానికి స్పందించడం ద్వారా బ్లాగ్‌ మరింత ప్రాచుర్యాన్ని పొందుతుంది.

బ్లాగులో కొంత మంది నెగిటివ్‌ కామెంట్స్‌ చేస్తూ ఉంటారు వాటికి కూడా పాజిటివ్‌గానే స్పందించాలి. కొంత మంది పలు రకాల‌ ప్రశ్నలు వేస్తూ ఉంటారు. వాటికి సమాదానాు ఇచ్చే ప్రయత్నం చేయాలే కానీ తప్పించుకునే ప్రయత్నం చేయకూడదు.

సమాచారం ఎక్సిక్లూజివ్‌గా ఉండాలి …
ఆన్‌లైన్‌లో నేడు అనేక మంది బ్లాగర్స్‌ సమాచారాన్ని అందిస్తున్నారు. అయా బ్లాగ్‌ను గమనిస్తూ ఉండాలి. బ్లాగులో మనం అందించే సమాచారం ప్రత్యేకతను కలిగి ఉండాలి. ఇది వరకే ఇంటర్నెట్‌లో ల‌బించే సమాచారమైతే ప్రయోజనం ఏమి ఉంటుంది. కావున మీరు ఇచ్చే సమాచారం నెటిజన్స్‌ను ఎట్రాక్ట్‌ చేయాలి .. వారిలో మీ వ్యాసాల‌ పట్ల ఆసక్తిని పెంచేలా ఉండాలి. అప్పుడే బ్లాగ్‌కు మంచి ట్రాఫిక్‌ వస్తుంది… త్వరగా పాపుర్‌ అవుతుంది.

మీ వ్యూ పాయింట్‌ అదిరిపోవాలి…
ఆన్‌లైన్‌లో ఇది వరకు చెప్పుకున్నట్టు అనేక మంది అనేక అంశాల‌ గురించి సమాచారం ఇస్తూ ఉంటారు. అయితే కొంత కాలానికి మనం అందించే సమాచారం ఇది వరకే ఇచ్చామనే ఫీలింగ్‌ రావచ్చు. అలా వచ్చినప్పటికీ ప్రస్తుత పరిస్థితును బట్టి క్రియేటివ్‌గా అందించే ప్రయత్నం చేయాలి. ఉదాహరణకు టెక్నాజీపైన అనేక బ్లాగ్స్‌ ఉన్నప్పటికీ .. మీరు అందించే టెక్నాల‌జీ సమాచారం ఇతరుల‌ కంటే బిన్నంగా వేరే కోణాల్లో ఇచ్చే ప్రయత్నం చేయాలి.
ఉదాహరణకు ప్రస్తుతం ఉన్న బర్నింగ్‌ టాపిక్‌ సైబర్‌ సెక్యూరిటీ, ఫేస్‌బుక్‌ ద్వారా సమస్యలు … ఇలా కొన్నింటిని ఎంచుకుని వాటిపై అప్‌డేటెడ్‌ సమాచారం ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఇవే టాపిక్స్‌ను మీ క్రియేటివిటీని ఉపయోగించి ఇతరుల‌ కంటే బిన్నంగా ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి.

అర్టికల్‌ పబ్లిష్‌ చేసే ముందుగా …
ఆన్‌లైన్‌లో నిత్యం అప్‌డేట్స్‌ చేస్తూ ఉంటాం. కావున సమయం సరిపోదు. టైమ్‌ మేనేజ్‌మెంట్‌ చేస్తూనే వ్యాసాల‌ను పోస్ట్‌ చేస్తూ
ఉండాలి. ఆన్‌లైన్‌లో వ్యాసాల‌ను పోస్ట్‌ చేసే ముందు అర్టికల్‌ను పూర్తిగా చెక్‌ చేయాలి. ప్రత్యేకంగా ఒకసారి రీడర్‌గా చదివి వ్యాసం ఎలా ఉందో అంచనా వేసుకోవాలి. ముఖ్యంగా ఫ్రూఫ్‌ రీడింగ్‌ చేయడం చాలా అవసరమని గుర్తించాలి. చాలా మంది బ్లాగర్స్‌ నేరుగా వ్యాసాన్ని టైప్‌ చేసిన వెంటనే పోస్ట్‌ చేస్తుంటారు. వ్యాసాన్ని ఒక‌టికి రెండు సార్లు చెక్ చేసుకుంటే మంచిది.

మ‌రిన్ని వివ‌రాల‌ను మూడ‌వ భాగంలో తెలుసుకుందాం.

News Reporter
Computers For You is a Leading Technology & Career Magazine Publishing from Hyderabad since 1999. In addition to this Web version, We have been bringing out Computers For You magazine for over 19 years (Since 1999) continuously and this is the Largest Circulated magazine in both the Andhra Pradesh and Telangana States and in addition to these States, this is being circulated in other cities like Bangalore, Chennai, New Delhi, Mumbai & Pune...etc.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *