సిఐఐ సదస్సుకు రండి, పెట్టుబడులు తెండి

అందాల, ఆహ్లాద ఆంధ్రప్రదేశ్ మీది, సానుకూలత సృష్టించే భరోసా నాది
రాష్ట్రం చిన్నదనుకోవద్దు, మా లక్ష్యాలు పెద్దవి
బిజినెస్ లీడర్స్ ఫోరం రోడ్‌షోలో ముఖ్యమంత్రి చంద్రబాబు

దుబాయి, ఫిబ్రవరి 8: ‘మీరు సమర్పించే పత్రాలను పరిశీలిస్తాం. పెట్టుబడులు తెండి. అనుమతులు, వ్యవస్థాపన అంశాలకు నేను భరోసాగా ఉంటాను. ఆ బాధ్యత నాది’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ‘మా రాష్ట్ర పారిశ్రామిక రాజధాని విశాఖలో ఈ నెల 24,25,26 తేదీలలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఐఐ సదస్సుకు మీరు తప్పక రావాలి’ అని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. యు.ఎ.ఇ బిజినెస్ లీడర్స్ ఫోరం ఆధ్వర్యాన ‘ఆంధ్రప్రదేశ్‌లో అవకాశాలు- ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాటా మంతీ’ అనే ఇతివృత్తంతో గురువారం దుబాయిలో ఏర్పాటైన రోడ్‌షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. మాది అందమైన, ఆహ్లాద రాష్ట్రం. పెట్టుబడులకు చక్కని గమ్యస్థానంగా ఎంచుకోండి’ అని సీఎం పిలుపునిచ్చారు. గల్ఫ్ లో స్థిరపడిన భారతీయ సంతతి వాణిజ్యవేత్తలనుద్దేశించి మాట్లాడుతూ ‘ఈ గడ్డ మీ ఎదుగుదలకు అవకాశాలను కల్పించింది. అందువల్ల ఈ దేశానికి విధేయంగా ఉండండి. జన్మనిచ్చిన జన్మభూమి భారత్ ను మాత్రం మర్చిపోవద్దు. భారత్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ ప్రతి పారిశ్రామిక వేత్త, ప్రతి వాణిజ్యవేత్త ఒక యూనిట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పాలన్నది నా స్వప్నం’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.

మా లక్ష్యాలు పెద్దవి
తాను తొమ్మిదేళ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశానని, ఇక్కడ ఉన్న అనేక మందికి తన విధానాలు, పనితీరు తెలిసినవేనని చంద్రబాబు అన్నారు. నాటి ప్రపంచ ధోరణులను అనుసరించి పాతికేళ్ల భవిష్యత్తును ముందే ఊహించి ఐటి విప్లవ విజయవంతానికి తోడ్పడ్డానని, సైబరాబాద్ నిర్మించి హైదరాబాద్‌ను ఐటిరంగానికి ఒక ప్రధాన చిరునామాగా నిలిపినట్లు చంద్రబాబు గుర్తుచేశారు. ప్రస్తుతం ఆనాటి రాష్ట్రంలోని 60% మాత్రమే ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాను. అయినా భవిష్యత్తు దార్శనికతతో అభివృద్ధికి 2022, 2029, 2050 వరకూ స్పష్టమైన లక్ష్యాలు ఏర్పరుచుకుని ముందుకు సాగుతున్నట్లు వివరించారు.

తాము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో నెంబర్-1 గా ఉన్నామని, ప్రఖ్యాత ‘లీ క్వాన్ యీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ’ వారి సహకారం తీసుకుంటున్నట్లు వివరించారు. తాము సొంతంగా ‘పబ్లిక్ సర్వీస్ డెలివరీ ఆర్డినెన్స్’ తీసుకొచ్చామని, ఇందువల్ల ప్రభుత్వం మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తున్నదని అన్నారు. వ్యవసాయ, ఆహార శుద్ధి, ఏరో స్పెస్, రక్షణ రంగాలపై నిశిత దృష్టి పెట్టి పనిచేస్తున్నట్లు, ఇంధన, ఐటీ, లైఫ్ సైన్సెస్, తోలు శుద్ధి పరిశ్రమల రంగాలపై కూడా ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నట్లు, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను విస్తృతంగా ప్రోత్సహిస్తున్నామని, తమ కృషితో రాష్ట్రంలో ఇప్పటికే కియా, ఇసుజు, అపోలో టైర్స్, వంటి పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్‌లో కొలువు తీరాయని, గమేష (Gamesha) సుజలిన్ కంపెనీలు ఇంధన రంగంలో తమతో కలసి పనిచేస్తున్నాయని ముఖ్యమంత్రి వివరించారు.

పారిశ్రామికాభివృద్ధికి దన్నుగా విసిఐసి, బి.సి.ఐ.సి: క్లస్టర్ల వారీగా అభివృద్ధి: ముఖ్యమంత్రి
ఏపీలో పరిశ్రమల స్థాపనకు, వ్యాపార నిర్వహణకు అత్యంత అనుకూల వాతావరణం నెలకొల్పామని, ఒక్కో ప్రాంతంలో ఒక్కో రంగం నెలకొనేలా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఆటోమొబైల్ రంగానికి అనంతపురం, సౌర విద్యుత్ రంగానికి కర్నూలు అనువైనవిగా గుర్తించి అక్కడ ఆయా పరిశ్రలు నెలకొల్పడానికి అనేక చర్యలు తీసుకున్నామని, తమ కృషి ఫలిస్తోందని అన్నారు. ప్రతి జిల్లాకు ఒక పారిశ్రామిక క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నామని, విశాఖపట్నం, చెన్నై పారిశ్రామిక కారిడార్ (VCIC) , బెంగుళూరు, చెన్నై పారిశ్రామిక కారిడార్ (BCIC) కారిడార్లు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధికి బాటవేస్తున్నాయని సీఎం అన్నారు. రాష్ట్రంలో రక్షణ, ఏరో స్పెస్ రంగాల అభివృద్ధికి అనుకూల వాతావరణం ఏర్పరిచామని చంద్రబాబు అన్నారు.

ఉత్తరాంధ్రలో జీడిపప్పు, మామిడి, చెరుకు, కొబ్బరి ప్రాసెసింగ్, తూర్పు, పశ్చిమ గోదావరి ప్రాంతంలో వరి, కొబ్బరి, అరటి, పామ్ ఆయిల్ శుద్ధి, రాయలసీమలో వేరు శనగ, బొప్పాయి, దానిమ్మ, బత్తాయి, మాంసం, డెయిరీ పరిశ్రమల అభివృద్ధికి చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. దక్షిణ కోస్తాలో సుగంధ ద్రవ్యాలు, చెరుకు, మామిడి, అరటి వంటి ఆహార శుద్ధి పరిశ్రమలలో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడి పెట్టాలనుకునే వారికి కావలసిన అన్ని అనుమతులు, వసతులు వెంటనే కల్పిస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ‘పెట్రో హబ్’ గా మారే అవకాశాలు ఉన్నాయని సీఎం చెప్పారు. తమ రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమలో విస్తార అవకాశాలున్నాయని, విశాఖ, ప్రకాశం, చిత్తూరుల్లో ఇప్పటికే తయారీ పరిశ్రమలున్నాయని, అత్యున్నత ఖనిజ సంపద కలిగి ఉండటం తమ రాష్ట్ర ప్రత్యేకత అని ముఖ్యమంత్రి తెలిపారు. హార్డ్ వేర్ తయారీ రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయని, ఇప్పటికే ఫాక్స్ కాన్ తమ రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తోందని అన్నారు.

జ్ఞాన కేంద్రంగా ఏపీ: ముఖ్యమంత్రి చంద్రబాబు
తమ రాష్ట్రాన్ని జ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ధ్యేయంతో పనిచేస్తన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ దిశగా తాము ప్రతిభా సామర్ధ్యాలకు మెరుగుపెట్టి శ్రేష్టంగా తీర్చిదిద్దేందుకు 8 శ్రేష్ట వైజ్ఞానిక కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కేంద్రాల్లో దృష్టి కేంద్రీకరించిన ప్రధాన అంశంలో నాయకత్వం, ఉత్తమ పద్ధతులు, పరిశోధన, సహకారం, శిక్షణ ఇస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 15 విశ్వవిద్యాలయాలున్నాయని, దుబాయ్ నుంచి వస్తున్న బి.ఆర్ షెట్టి గ్రూప్ వైద్య విజ్ఞాన విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పబోతోందని తెలిపారు. హరిత, జల ఇతివృత్తాలతో నిర్మిస్తున్న రాజధాని అమరావతి దేశంలోనే పెద్ద హరిత క్షేత్ర నగరమని అన్నారు. ఇక్కడ పెట్టుబడులు పెడితే ఎన్నో అవకాశాలు లభిస్తాయని చెప్పారు. అనేక ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ వాటికి ఎదురు నిలిచి దుబాయ్ అభివృద్ధి చెందిందని, కానీ అమరావతి నగర నిర్మాణానికి అన్నీ అనుకూలాంశాలే ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.

మౌలిక సదుపాయాలైన నీరు, విద్యుత్తు పుష్కల స్థాయిలో లభిస్తున్నాయని, పరిశ్రమల ఏర్పాటుకు తమ దగ్గర వాతావరణం ఎంతో అనుకూలాంశమని తెలిపారు. తమ రాష్ట్ర సాంస్కృతిక, కళా వైభవాన్ని, వారసత్వ సంపద విశిష్టతను చాటే పర్యాటక ఆకర్షణలున్న ప్రాంతాలను తాము పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేశామని చంద్రబాబు చెప్పారు.
సమీకరణ పద్ధతిలో 30 వేల ఎకరాల భూమి : 2050 నాటికి 3.5 మిలియన్ల ఉద్యోగావకాశాలు
2050 నాటికి అమరావతిలో 3.5 మిలియన్ల ఉద్యోగావకాశాలను సృష్టించనున్నామన్నారు. 1600 కి.మీ మే సైకిల్ దార్లను నిర్మించనున్నట్లు, సుస్థిర, హరిత అభివృద్ధి నగరంగా రూపొందుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. కొత్తగా ఏర్పడిన తమ రాష్ట్రానికి మకుటం లాంటి రాజధాని ఏర్పాటు తక్షణావసరంగా గుర్తించినట్లు, ఈ దశగా రైతులను ఒప్పించామని, 30 వేల ఎకరాల భూమిని రాజధాని అమరావతి నిర్మాణానికి సమీకరణ పద్ధతిలో రైతులు ఇచ్చారని, ఇది దేశచరిత్రలోనే అపూర్వమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
గత ఏడాది 163.6 బిలియన్ల విలువైన 665 ఎంఓయూలు
2017లో తాము163.6 బిలియన్ల విలువైన 665 ప్రాథమిక అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఈ ఎంఓయూలు పూర్తిస్థాయిలో ఆచరణకు వస్తే 5.5 లక్షల ఉద్యోగావకాశాలు లభిస్తాయని సీఎం తెలిపారు. ప్రజా సంతృప్తి, ప్రజా సంక్షేమం ధ్యేయంగా తాము పరిపాలనలో అధునాతన సంస్కరణలు తీసుకొచ్చినట్లు చంద్రబాబు అన్నారు రియల్ టైమ్ గవర్నెన్స్ (RTG), ఒక్క ఫోన్ కాల్‌తో ప్రజా సమస్యలు తీర్చే ‘పరిష్కార వేదిక’ ప్రారంభించామని వివరించారు. ముఖ్యమంత్రి బృందంలో ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి. సాయిప్రసాద్, మౌలిక వసతుల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ఏపీఈడీబీ సీఈవో జాస్తి కృష్ణ కిషోర్ వున్నారు.

About Digital For You 773 Articles
Computers For You is a Leading Technology & Career Magazine Publishing from Hyderabad since 1999. In addition to this Web version, We have been bringing out Computers For You magazine for over 19 years (Since 1999) continuously and this is the Largest Circulated magazine in both the Andhra Pradesh and Telangana States and in addition to these States, this is being circulated in other cities like Bangalore, Chennai, New Delhi, Mumbai & Pune...etc.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*